శభాష్ టాస్క్ ఫోర్స్... శివానందబాబా అరెస్టు!
హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు అద్భుతంగా పని చేశారు. సరిగ్గా 24 గంటల్లోనే కేసు ఛేదించారు. లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని ముధుసూదన్ రెడ్డిని కోటీ 30 లక్షల రూపాయలకు ముంచిన కేసులో ప్రధాన నిందితుడు శివానందబాబాను బెంగళూరు సమీపంలో అదుపులోకి తీసుకున్నామని టాస్క్ ఫోర్స్ తెలిపింది. నిన్న సాయంత్రం అతను హైదరాబాదు నుంచి డబ్బులు తీసుకుని బెంగళూరు వెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు.
అయితే అతని ఫోన్ ను ట్రేస్ చేసిన పోలీసులు, అంతకు ముందు శివానందబాబా ఎవరెవరితో మాట్లాడాడన్న దానిపై దృష్టి సారించారు. దీంతో శివానందబాబాతో ఫోన్ లో మాట్లాడిన వారిని ట్రేస్ చేసి, వారిని తమదైన శైలిలో విచారించి, ఆయన ఎక్కడెక్కడ దాక్కునే అవకాశం వుందో తెలుసుకున్నారు. అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం బెంగళూరు శివారుల్లో అతనిని హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. అతని నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.